ఏపీలో జెండా పట్టుకునే పరిస్థితి కూడా లేని కాంగ్రెస్ పార్టీకి, ప్రజలు ఎప్పుడో మరిచిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త నాయకత్వం తెరమీదికి వచ్చింది. కాంగ్రెస్ ఏపీ చీఫ్‌గా డాక్టర్ సాకే శైలజానాథ్, డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలిలు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధిష్టానం ఎన్నో వడపోతల అనంతరం, వీరికి ఈ పగ్గాలు అప్పగించిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ ముగ్గురు జీవచ్ఛవం లా ఉన్న పార్టీని ఏవిధంగా ముందుకు నడిపిస్తారు? అసలు వీరి ప్రజా బలం ఎంత? వీరి వ్యూహం ఏంటి? గతంలో వీరు ఎలా వ్యూహాత్మకంగా ముందుకు సాగారు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సర్వసాధారణం.
ఆయా విషయాలను పరిశీలిస్తే.. ఈ ముగ్గురిలోనూ శైలజానాథ్, మస్తాన్ వలి మాత్రమే ప్రజాక్షేత్రం నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక, తులసిరెడ్డి ప్రజాక్షేత్రం నుంచి ఎప్పుడూ విజయం సాధించలేదు. ఓ రకంగా వీళ్లంతా అవుట్ డేటెడ్ నేతలే.. వీళ్లతో ఏపీలో ఈ ముసలి కాంగ్రెస్ ఎలా బతుకుతుంది ? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ క్రమంలో వీరు ఏ విధంగా పార్టీని లీడ్ చేస్తారు? ప‌్రజల నాడిని ఎలా పట్టుకుంటారు? పార్టీకి అనుకూలంగా ప్రజలను ఎలా మళ్లిస్తారనేది ఆసక్తిగా మారింది.
సాకే శైలజానాథ్: ఎంబీబీఎస్, ఎండీ కూడా చేసిన డాక్టర్ శైలజానాథ్.. ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడు. అనంతపురం జిల్లా శింగనమల నుంచి 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. ప్రజా గళం వినిపించే నాయకుడిగా పేరున్నా.. ఉత్తరాంధ్ర, కోస్తాలోని ఉభయ గోదావరి జిల్లాలకు ఈయన పెద్దగా తెలియదు. ఈయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. వ్యూహంతో వ్యవహరించే నాయకుడిగా ఆయనకు పెద్దగా పేరు లేక పోవడం గమనార్హం. వైఎస్ ఆశీర్వాదంతోనే ఆయన గెలిచినట్టు గతంలో పలుమార్లు చెప్పుకొన్నారు. 2014లో పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.
తులసి రెడ్డి: నర్రెడ్డి తులసిరెడ్డి ఎంబీబీఎస్ చేశారు. డాక్టర్ కొన్నాళ్లు వైద్య వృత్తిలోనూ ఉన్నారు. కడప జిల్లాకు చెందిన ఆయన వైఎస్‌కు ఆప్తుడిగా కాంగ్రెస్‌లోకి చేరారు. ఇక, రాజ్యసభ సభ్యుడిగా గతంలో పనిచేశారు. ఇక, వైఎస్ ప్రభుత్వం వచ్చాక 20 సూత్రాల కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి, కేబినెట్ హోదాను అప్పగించి, ఆయనను చైర్మన్ ను చేశారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో ఎప్పుడూ తులసి రెడ్డి పోటీ చేసింది లేదు. ఇక, ఈయన రాజకీయాల్లోని కొందరు మేధావులకు తప్ప సాధారణ ప్రజానీకానికి పెద్దగా పరిచయం లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గాబాధ్యతలు చేపట్టారు.
మస్తాన్ వలి: మైనార్టీ వర్గానికి చెందిన వలీ.. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి 2009లో విజయం సాధించారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. మైనార్టీ వర్గాల్లో మంచి పట్టున్న నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత మౌనం పాటించారు. ఒడిసా కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహించిన వలీ .. ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. మరి ఈ ముగ్గురు భిన్నమైన వ్యక్తిత్వాలు, భిన్నమైన వర్గాల నుంచి వచ్చారు కాబట్టి.. పార్టీని పుంజుకునేలా చేస్తారని పార్టీ అదిష్టానం ఆశలు పెట్టుకుంది. మరి ఏమేరకు వీరు కృషి చేస్తారో చూడాలి.