మ‌హారాష్ట్ర‌లోనూ క‌ర్నాట‌క స్కెచ్… బీజేపీ మార్క్ పాలిటిక్స్‌..!

-

మహారాష్ట్ర‌లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. గంట‌గంట‌కూ అనూహ్య మ‌లుపులు తిరుగుతోంది. శివ‌సేన‌, కాంగ్రెస్‌, ఎన్సీపీలు ప్ర‌భుత్వ ఏర్పాటుకు ముందుకు వ‌స్తున్న త‌రునంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు చేసిన వ్యాఖ్య‌లు మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో కాక‌పుట్టిస్తున్నాయి. క‌ర్నాట‌క స్కెచ్‌ను మ‌హారాష్ట్రలోనూ అమ‌లు చేసేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేస్తోందా..?  కాంగ్రెస్‌, శివ‌సేన ఎమ్మెల్యేల‌ను లాగేసేందుకు ప‌క్కా ప్లాన్ వేస్తోందా..? అంటే ఆపార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు చేసిన వ్యాఖ్య‌లు ఔన‌నే అంటున్నాయ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

త‌గిన సంఖ్యాబ‌లం లేద‌ని, తాము ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌లేమ‌ని చేతులెత్తేసిన బీజేపీ నేత‌లు.. ఇప్పుడు ఇలా మాట్లాడ‌డంలో ఆంత‌ర్యం అదేన‌ని చెబుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని ? అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. నిజానికి.. ఎన్నిక‌ల్లో బీజేపీ-శివ‌సేన క‌లిసి పోటీ చేసిన విష‌యం తెలిసిందే. బీజేపీ 105 సీట్ల‌తో పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. అయితే.. సీఎం ప‌ద‌వి త‌మ‌కే ఇవ్వాల‌ని శివ‌సేన ప‌ట్టుబ‌ట్ట‌డంతో బంధం చెడిపోయింది.

ఇక ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ శివ‌సేన‌ను ఆహ్వానించ‌డం, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల‌తో చ‌ర్చ‌లు జరుపుతుండ‌గానే.. ఎన్సీపీని ఆహ్వానించ‌డం.. ఆ వెంట‌నే రాష్ట్ర‌ప‌తిపాల‌నకు సిఫార్సు చేయ‌డం, ఆవెంట‌నే కేంద్ర‌కేబినెట్ నిర్ణ‌యం తీసుకోవ‌డం.. రాష్ట్ర‌ప‌తి ఆమోదం తెలుప‌డం.. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే జ‌రిగిపోయింది. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి పాల‌న కొన‌సాగుతోంది. అయితే ఆరునెలల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే.. తిరిగి ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోం శాఖ ఇటీవలే ప్రకటించింది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీలు ముందుకు వస్తే.. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తామని కూడా ఈ తెలిపింది. అయితే, శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌తో ప్ర‌భుత్వ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించాయి. ఇక మ‌రో 25ఏళ్లూ శివ‌సేన ముఖ్య‌మంత్రి ఉంటార‌ని కూడా ఆ పార్టీ ప్ర‌క‌టించింది. ఇదే స‌మ‌యంలో ఈ క్ర‌మంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆయ‌న‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

105 సీట్లతో రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని.. ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో..తమ పార్టీ బలం 119కి చేరిందన్నారు. అంతేగాకుండా.. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తున్నారని.. బీజేపీ ప్రమేయం లేకుండా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అనేది అసాధ్యమ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. స్వంత్రుల మ‌ద్ద‌తు ఉన్నా.. బీజేపీ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే.. ఇంకా 24మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కావాలి. వీరిని ఎక్క‌డి నుంచి తీసుకొస్తారు..? అన్న‌దే ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

అంటే.. క‌ర్నాట‌కలో కాంగ్రెస్‌, జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కూల్చడానికి అమ‌లు చేసిన వ్యూహాన్నే మహారాష్ట్ర‌లోనూ అమ‌లు చేయ‌డానికి బీజేపీ క‌స‌ర‌త్తు చేస్తుంద‌న్న‌ది స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అయితే.. శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి ముందే ఆ పార్టీల ఎమ్మెల్యేల‌ను లాగుతారా..?  లేక ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత లాగుతారా..? అన్న‌ది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉత్కంఠ‌ను రేపుతోంది. ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news