ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతంలో రీసెంట్‌గా పర్యటించిన లోకేష్.. ఉద్యమంలో పాల్గొన్న మహిళలు, వృద్ధులు, రైతులను ఉద్దేశించి దాదాపు గంట సేపు ప్రసంగించా రు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో సీఎం జగన్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశా రు. రాజధానిలో ఇప్పటి వరకు 10 మంది రైతులు రాజధాని అమరావతి ఎక్కడ తరలిపోతుందోననే భయంతో హఠాన్మరణం చెందారని, వారంతా కూడా పేదవారేనని, ఇప్పుడు వారి మరణంతో ఆయా కుంటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పారు లోకేష్.
అదేసమయంలో సీఎం జగన్ వచ్చి మృతి చెందిన రైతుల కుటుంబాలను ఎందుకు పరామర్శించడం లేదని లోకేష్‌ప్రశ్నించారు. అంతేకాదు, ఇప్పుడు ఓదార్పు యాత్రలు గుర్తుకు రాలేదా? లేక ఓదార్పు యాత్రలు చేయాలని అనుకోవడం లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ ఇవ్వండి-అని కాళ్లా వేళ్లా పడ్డారని, మహిళలను చెల్లి , అక్కా అని పిలుస్తూ.. సెంటిమెం టును కురిపించారని కానీ, ఇప్పుడు వారికే గుండెల్లో మంటలు పెడుతున్నారని, పండగ పూట రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేసేలా చేశారని విమర్శించారు.
దీంతో స్థానికంగా లోకేష్‌కు చప్పళ్లతో స్వాగతం లభించినా.. విమర్శకులు మాత్రం తమ వ్యాఖ్యలకు పదును పెంచారు. నారా లోకేష్‌లో ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని దుయ్యబడుతున్నారు. ఓదార్పు యాత్రలు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటి? అసలు అమరావతిలో ఆందోళలనలను ప్రోత్సహిస్తోంది ఎవరు? ఎందుకు రైతులు చనిపోతున్నారు? దీనికి ప్రతిపక్షం కారణం కాదా? అని ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి.
రైతుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపాల్సిన ప్రతిపక్షం టీడీపీ వీరిని తనకు అనుకూలంగా రాజకీయ పావులుగా వాడుకోవడం లేదా? అని ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు. రైతులపై ప్రేమ ఉంటే.. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు లోకేషే ఓదార్పు యాత్రలు చేపట్టవచ్చుకదా? అని అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై టీడీపీ గణం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.