అంతర్జాతీయ బీర్ దినోత్సవం ( International Beer Day ) : వేడిగా వాతావరణం ఉన్నప్పుడు గొంతులో చల్లని బీర్ పడితే వచ్చే మజాయే వేరు. ఆ విషయం గురించి బీర్ ప్రియులకు ఎక్కువగా తెలుస్తుంది. అయితే అన్నింటికీ ఒక రోజు ఉన్నట్లే బీర్‌కు కూడా ఒక రోజు ఉంది. ఆ రోజును అంతర్జాతీయ బీర్ డే (ఐబీడీ) అని పిలుస్తారు. ఈ బీర్ డేను ప్రతి ఏడాది ఆగస్టు నెలలో వచ్చే మొదటి శుక్రవారం రోజున జరుపుకుంటారు.
2007లో కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్‌కు చెందిన జెస్సి అవ్షాలొమొవ్ మొదటి సారిగా బీర్ డే ను మొదలు పెట్టగా అప్పటి నుంచి ప్రతి ఏటా బీర్ డేను జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బీర్ డేను చాలా మంది జరుపుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా 6 ఖండాల్లోని 80 దేశాల్లో 207 నగరాల్లో బీర్ డేను ప్రతి ఏడాది నిర్వహిస్తారు. ఈ సందర్బంగా స్నేహితులు అందరూ కలిసి బీర్లను తాగుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే దీన్ని జరుపుకునేందుకు ప్రత్యేకంగా ఏమీ కారణాలు లేవు. కానీ బీర్ తాగడాన్ని ప్రోత్సహించేందుకు, స్నేహితులతో కలసి సరదాగా గడిపేందుకు, సొంతంగా బీర్ తయారు చేసుకునేందుకు, పలు పోటీలను నిర్వహించేందుకు.. ఈ బీర్‌డే ను జరుపుకుంటారు.
ఇక మన దేశంలోనూ దీన్ని జరుపుకుంటారు. బీర్‌డే సందర్బంగా పలు బార్లు, హోటల్స్, పబ్‌లలో బీర్లపై ప్రత్యేక రాయితీలను అందిస్తుంటారు. బీర్ కు ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది. దానికి గుర్తింపుగానే బీర్ డేను జరుపుకుంటారు.