విమానాశ్రయంలో గ్యాస్ లీకై సుమారు 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురైన ఘటన మలేసియాలో చోటుచేసుకుంది. కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్‌లోని సదరన్ సపోర్ట్ జోన్ సెపాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ వద్ద గురువారం ఉదయం 11.23 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) గ్యాస్ లీకైంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న సెలంగోర్ అగ్నిమాపక విభాగం వెంటనే అక్కడికి చేరుకుని లీకేజీని నివారించింది. ఈ ఘటనలో దాదాపు 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.
వారందరిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇక అస్వస్థతకు గురైన వారిలో 14 మందిని చికిత్స కోసం ఎయిర్ డిజాస్టర్ యూనిట్‌కి పంపారు. అందులో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. విడుదలైన గ్యాస్‌ను మిథైల్ మెర్‌కాప్టాన్‌గా గుర్తించామని పేర్కొన్నారు. విమాన రాకపోకల సమయాల్లో ఎటువంటి మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.