రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్.. తాము సరఫరా చేసిన క్లస్టర్ ఆయుధాలను వాడుతుందని అమెరికాలోని శ్వేత సౌధం ధ్రువీకరించింది. రష్యా సైన్యం స్థావరాలు, ఆపరేషన్లపై ఇవి చాలా ప్రభావం చూపుతున్నాయని నేషనల్ సెక్యూరిటీ ప్రతినిధి జాన్ కిర్బి వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌కు చెందిన ఒడెస్సా పోర్టు తదితర కీలక ప్రాంతాలపై రష్యా ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులు చేస్తోంది. దీనికి ప్రతిదాడిగా.. ఉక్రెయిన్ దళాలు క్లస్టర్ ఆయుధాల వినియోగం ప్రాంభించాయి.
జులై 8వ తేదీన క్లస్టర్ ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా.. వారం తర్వాత వాటిని కీవ్‌కు చేర్చింది. అమెరికా పంపిన వాటిల్లో ఎం864, ఎం483ఎ1 క్లస్టర్ ఆయుధాలున్నాయి. వీటిల్లో డడ్‌రేటు 2.35శాతం కంటే తక్కువగా ఉంటుంది. ఈ రకం ఆయుధ సరఫరాతో ఉక్రెయిన్‌కు మందుగుండు కొరత కూడా తీరుతుంది. తాజాగా తాము ఇచ్చిన క్లస్టర్ ఆయుధాలను ప్రజలు నివసించే ప్రాంతాల్లో వాడమని ఉక్రెయిన్ వద్ద మాటతీసుకొన్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు.