హుస్నాబాద్ లెక్కలు.. కారు హ్యాట్రిక్ కొడుతుందా?

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం…2008లో కొత్తగా ఏర్పడిన స్థానం…అటు సిద్ధిపేటలో మూడు మండలాలు, ఇటు కరీంనగర్, హన్మకొండల్లో రెండేసి మండలాలు చొప్పున కలిపి హుస్నాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. అయితే 2009లో ఎన్నికలు జరగగా, ఆ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. 2009లో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి విజయం సాధించారు.

ఇక తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ హవా నడిచింది. సతీశ్ కుమార్..దాదాపు 34 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి ప్రవీణ్ పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికలకు వచ్చేసరికి బి‌ఆర్‌ఎస్ నుంచి మళ్ళీ సతీశ్ నిలబడగా..ఈ సారి కాంగ్రెస్, టి‌డి‌పి, కమ్యూనిస్టులు కూటమి కట్టి..ఆ కూటమిలో సి‌పి‌ఐ నుంచి చాడ వెంకటరెడ్డి పోటీ చేశారు. అయితే కూటమి విఫలం కావడంతో..మళ్ళీ సతీశ్ 70 వేల భారీ మెజారిటీతో గెలిచారు. ఇలా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు.

ఎమ్మెల్యేగా సతీశ్ బాగానే పనిచేస్తున్నారు. అవినీతి మరకలు అంటకపోవడం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కొడుకు కావడం, సాధ్యమైన మేర అభివృద్ధి పనులు చేయడం ఎమ్మెల్యేకు కలిసొచ్చే అంశాలు. అయితే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పూర్తిగా పంపిణీ చేయకపోవడం, గౌరవెల్లి నిర్వాసితుల సమస్య…అలాగే ప్రజలతో పూర్తిగా మమేకం కాకపోవడం సతీశ్‌కు నెగిటివ్ అవుతుంది.

ఇదే సమయంలో 2014లో కాంగ్రెస్ లో ఓడిపోయి..బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్ళి..2018లో సీటు దక్కకపోతే మళ్ళీ కాంగ్రెస్ లోకి తిరిగొచ్చిన ప్రవీణ్ గట్టిగానే కష్టపాడుతున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ బలంగా ఉంది. అటు సి‌పి‌ఐకి బలం ఉంది. బి‌ఆర్‌ఎస్ తో పొత్తు ఉంటే చాడ బరిలో ఉంటారా? అనేది క్లారిటీ లేదు. పొత్తు లేకపోతే మాత్రం బరిలో ఉంటారు. అటు బి‌జే‌పికి బలం తక్కువే..కానీ సీటు కోసం బొమ్మ శ్రీరామ్, చాడ శ్రీనివాస్ రెడ్డి పోటీ పడుతున్నారు.

ఎవరు పోటీలో ఉన్న ప్రధాన పోరు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది. చూడాలి మరి ఈ సారి ఎవరు పైచేయి సాధిస్తారో..

Read more RELATED
Recommended to you

Latest news