కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించే నిధులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనికి అనుగుణంగానే రైతు భరోసా అమలుపై విధివిధానాలను రూపకల్పన చేస్తామని తెలిపారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో భాగంగా భట్టి నేతృత్వంలోని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రైతు కార్యశాల నిర్వహించింది.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను విడతల వారీగా పూర్తి చేస్తామన్నారు. రైతు బీమా పథకం కొనసాగుతుందని, అందులో అనుమానపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకున్నట్లుగా కాకుండా అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.
‘ఓ పక్క నాడు ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నారు. మరో పక్క దానికి రైతు బంధు డబ్బులు కూడా పడ్డాయి. ఇలాంటి వారికి ప్రభుత్వ పథకాలు అందితే పేద, ధనిక తారతమ్యం పెరుగుతుంది. ఇలాంటి వాటిని బయటకు తీస్తేనే అసలైన పేదలు, సామాన్యులు, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతాయి’’ అని భట్టి అన్నారు.