పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో యుద్ధం ఆవరిస్తుందో తెలియకుండా ఉంది. ఇజ్రాయెల్పై యుద్ధానికి ఇరాన్, హెజ్బొల్లా సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్కు 20 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ విక్రయాల ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది.
ఈ ఆయుధాల్లో అనేక ఫైటర్ జెట్లు, 50పైగా ఎఫ్-15 ఫైటర్ జెట్స్, అడ్వాన్స్‌డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, 120 ఎమ్ఎమ్ ట్యాంక్ మందుగుండు సామగ్రి, అధిక పేలుడు మోర్టార్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఆయుధాలన్నీ ఎప్పుడు ఇజ్రాయెల్కు చేరుకుంటాయనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటికే ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా యుద్ధానికి ఇరాన్ తెగబడొచ్చనే వార్తలు ప్రపంచాన్ని భయానికి గురి చేస్తున్నాయి. అయితే ఈ ఆయుధాలన్నింటిని ఇజ్రాయెల్కు అప్పగించడానికి కొన్నేళ్లు పట్టనున్నట్లు సమాచారం. జ్రాయెల్పై ప్రతీకార కాంక్షతో రగిలిపోతున్న ఇరాన్, దాడికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న సమయంలోఇజ్రాయెల్ ఆయుధ విక్రయ ఒప్పందానికి అమెరికా ఆమోదించడం గమనార్హం.