ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతున్న విషయం విదితమే. అయితే ఫార్మా కంపెనీలు డిమాండ్‌కు తగినట్లుగా టీకాలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడం లేదు. అనేక దేశాల్లో వ్యాక్సిన్ల కోసం తీవ్రంగా కొరత నెలకొంది. దీంతో చాలా చోట్ల టీకాలు లభించడం లేదు. ఈ క్రమంలోనే వచ్చిన టీకాలను వచ్చినట్లు ప్రజలకు వెంట వెంటనే వేస్తున్నారు. అయితే ప్రపంచ దేశాలన్నీ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలంటే కొన్ని ఏళ్ల సమయం పడుతుంది. మరోవైపు ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అన్ని దేశాల్లోనూ టీకాల పంపిణీని పూర్తి చేయాలంటే అందుకు కనీసం 1100 కోట్ల డోసులు అవసరం అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు.
తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంటోనియో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలంటే.. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ టీకాలను వేయడం పూర్తి చేయాలంటే.. అందుకు 1100 కోట్ల డోసులు అవసరం అవుతాయని అన్నారు. అందువల్ల కంపెనీలు శరవేగంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో 30 శాతం మందికి టీకాలను పూర్తి స్థాయిలో వేశారని, ఇంకో 70 శాతం మంది మిగిలి ఉన్నారని, వారికి పూర్తిగా టీకాలను వేయాలంటే 1100 కోట్ల డోసులు అవసరమని అన్నారు. వ్యాక్సినేషన్‌ను వెంటనే పూర్తి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ మరిన్ని మార్పులకు గురయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. అదే జరిగితే వైరస్ మరింత ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల టీకాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడమే కాక వాటిని వేగంగా పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.