కరోనా వైరస్ మందు కోసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి ఏ మందు అయితే సరిగా సరిపడుతుందో అర్ధం కాక ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న వైద్య నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. దానికి మందు కూడా ఇప్పట్లో వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు. ప్రస్తుతం రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధాలను వాడుతున్నారు వైద్యులు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అమెరికాలో మరో మందు అందుబాటులోకి వచ్చింది. యాంటీ వైరస్ డ్రగ్ రెమ్‌డెసివిర్ వాడేందుకు అమెరికా అధికారిక అనుమతులను జారీ చేసింది. రెమ్‌డెసివిర్ కరోనా కట్టడిలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు అక్కడి వైద్యులు స్పష్టం చేసారు. అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ అయిన ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’(ఎఫ్‌డీఏ) ఈ డ్రగ్ ‘అత్యవసర వినియోగ అనుమతి’(ఈయూఏ)కి ఆదేశాలు ఇచ్చింది.
ఈ మందుని ఆ దేశానికి చెందిన ‘గిలీడ్ సైన్సెస్’ అనే సంస్థ ఉత్పత్తి చేస్తుంది. కరోనా రోగుల ఆరోగ్యం విషమిస్తే మాత్రమే దీనిని వాడాలి అని సూచించారు. ఎఫ్‌డీఏ నిర్ణయాన్ని స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గిలీడ్ సీఈఓతో కలిసి ఒక ప్రకటన చేసారు. ఇది కరోనా కట్టడిలో కీలక అడుగు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.