అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జ్ఞాపకశక్తిని లైవ్‌లో చూసి మరోసారి అమెరికన్లు షాకయ్యారు. మెక్సికో సరిహద్దుల్లో గాజా ఉందంటూ ఓ ప్రెస్‌మీట్‌లో ఆయన వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా బిత్తరపోయారు. తన జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉందని స్వీయ ధ్రువీకరణ ఇచ్చుకున్న కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
అమెరికా రహస్య పత్రాలను జోబైడెన్ తన సొంత ఇంట్లో పెట్టుకోవడంపై నివేదిక ఇచ్చిన స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ హుర్ అందులో ఆయన జ్ఞాపకశక్తిపై సందేహాలు వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో ‘జ్ఞాపకశక్తి తక్కువ ఉన్న వృద్ధుడు’ అని అభివర్ణించగా ఈ విషయంపై బైడెన్ స్పందించారు. ‘‘నాకన్ని భేషుగ్గా గుర్తుంటాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎన్ని పనులు చేశానో చూడండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే సమయంలో గాజాకు మానవీయ సాయం పంపడంపై బైడెన్‌ను విలేకర్లు ప్రశ్నించగా.. అప్పుడాయన సమాధానం చెబుతూ.. ‘‘మీకు ముందే తెలుసు. మెక్సికో అధ్యక్షుడు ఎల్ సిసి సరిహద్దులు తెరిచి (గాజా సరిహద్దులు) మానవీయ సాయం పంపేందుకు ఇష్టపడలేదు. నేను ఆయనతో మాట్లాడి గేట్లు తెరిపించాను’’ అని చెప్పారు. ఆ తర్వాత అధ్యక్ష బృందం ఆ తప్పును సరిదిద్దింది.