అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూకే బర్గర్ కింగ్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. మహిళలు ఉండాల్సింది కిచెన్‌లోనే అని ట్వీట్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బర్గర్ కింగ్‌ను తీవ్రంగా విమర్శించారు. కొందరైతే అసభ్య పదజాలంతో బర్గర్ కింగ్‌ను దూషించారు. ఈ విషయంపై దుమారం అంతకంతకూ పెరుగుతుండడంతో బర్గర్ కింగ్ ఎట్టకేలకు స్పందించింది. ఆ ట్వీట్ ను డిలీట్ చేయడంతోపాటు అలాంటి ట్వీట్ చేసినందుకు క్షమించమని కోరింది.
అయితే తాము ఆ ట్వీట్‌ను ఉద్దేశ్వపూర్వకంగా చేయలేదని బర్గర్ కింగ్ వివరణ ఇచ్చుకుంది. యూకేలో ప్రొఫెషనల్ చెఫ్‌లలో 20 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని, అందువల్ల ఆ రంగంలో మహిళల శాతాన్ని పెంచడం కోసం, వారికి ప్రొఫెషనల్ కిచెన్‌లలోనూ సముచిత స్థానాన్ని కల్పించాలన్న ఉద్దేశంతోనే తాము ఓ యాడ్ ఇచ్చామని, అందుకనే ఆ ట్వీట్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. తమ ట్వీట్ వెనుక ఉన్న ఉద్దేశం మహిళలకు ఆ రంగంలో ప్రాధాన్యతను కల్పించాలనేదే అని తెలిపింది. అందులో భాగంగానే అలాంటి వారు తమ కెరీర్‌ను ఈ రంగంలో బిల్డ్ చేసుకునేందుకు తాము స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తున్నామని తెలిపింది.
We decided to delete the original tweet after our apology. It was brought to our attention that there were abusive comments in the thread and we don't want to leave the space open for that.
— Burger King (@BurgerKingUK) March 8, 2021
కానీ తమ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుకున్నారని బర్గర్ కింగ్ తెలిపింది. మహిళల స్థానం కిచెన్‌కే పరిమితం అన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు బర్గర్ కింగ్ ట్వీట్లు చేసింది. అయితే తమ ట్వీట్ పట్ల కొందరు అసభ్య కామెంట్లు చేస్తున్నారని, అలాంటి వాటికి తావు ఉండకూడదనే ఉద్దేశంతోనే క్షమాపణలు చెబుతున్నామని బర్గర్ కింగ్ తెలియజేసింది.