ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ఘటనలో 24 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే ఉన్నారు. ఆఫ్రికా దేశమైన మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్‌లో ఆదివారం రోజున ఈ ఘటన చోటుచేసుకుంది.
డెమ్నాట్ పట్టణంలో వారాంతపు సంతకు వెళ్తున్న మినీ బస్సు ప్రమాదకర మలుపు వద్ద లోయలో బోల్తా పడింది. వేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని.. మృతుల్లో ఎక్కువమంది వ్యవసాయ కూలీలే ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ప్రమాదం గురించిన సమాచారం అందగానే రాయల్ జెండర్మీర్ పౌర రక్షణ సంస్థ సహాయక చర్యలు చేపట్టింది. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకొన్న దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.