ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై ఇప్పటికే సంచలన ఆరోపణలు చేసి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతకు కారణమైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. తాము బహిరంగంగా ప్రకటించడం వల్లే భారత్ భవిష్యత్తు కార్యాచరణ విషయంలో వెనుకడుగు వేసిందని వ్యాఖ్యానించారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లో తాను చేసిన ప్రకటన భారత్‌కు అతిపెద్ద అడ్డంకిగా మారి కెనడాను సురక్షిత ప్రదేశంగా మార్చేందుకు దోహదపడిందని గొప్పలకు పోయారు.
“నిజ్జర్ హత్య కేసుతో భారత్‌కున్న సంబంధాలు మీడియాకు లీకయ్యే అవకాశం ఉండటంతో సెప్టెంబర్ 18న తానే బహిర్గతం చేశాను. మొత్తం పరిణామాలపై ప్రభుత్వానికి పూర్తి పట్టుందని కెనడా వాసులకు చెప్పేందుకు ఈ చర్య ఉపయోగపడింది. బ్రిటిష్ కొలంబియాలో నిజ్జర్ హత్య తర్వాత సిక్కుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణకు అవసరమైన అన్ని దౌత్య, భద్రతా చర్యలు తీసుకోవడంతోపాటు.. ఇంకో ఘటన చోటు చేసుకోకుండా మరో స్థాయి నిరోధకం ఉండాలని భావించాం. ఈ క్రమంలో భారత్ ఇలాంటి మరో చర్య తీసుకోకుండా అడ్డుకోవాలనుకొన్నాం’’ అని కెనడాకు చెందిన సీటీవీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రూడో పేర్కొన్నారు.