పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇవాళ ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. సమావేశాలు జరుగుతుండగా లోక్‌సభలో ఇద్దరు ఆగంతుకులు కలకలం సృష్టించారు. అకస్మాత్తుగా సభలోకి చొచ్చుకుని వచ్చి టియర్ గ్యాస్ ప్రయోగించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే వారిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, దర్యాప్తు బృందాలు మరింత అప్రమత్తమయ్యాయి.
ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారులు పార్లమెంట్‌కు చేరుకుని నిందితులిద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఛాంబర్లోకి దూకిన ఇద్దరు నిందితులను గుర్తించినట్లు చెప్పారు. వారిని సాగర్ శర్మ, మనోరంజన్ గా గుర్తించారు. అలాగే నిందితుల నేపథ్యాన్ని పరిశీలిస్తున్నామని, ఉగ్రమూలాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఐబీ అధికారులు తెలిపారు.
నిందితులిద్దరి స్వస్థలం కర్ణాటకలోని మైసూర్ అని.. సాగర్ శర్మ బెంగళూరులోని ఒక యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడని ఐబీ అధికారులు చెప్పారు. సమగ్ర దర్యాప్తు కోసం స్థానిక పోలీసులతో పాటు ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా నిందితుల ఇళ్లకు వెళ్లి వారికి ఏవైనా ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయా అనే కోణంలో ప్రశ్నించినట్లు వెల్లడించారు. విజిటర్స్ గ్యాలరీలోకి నిందితులు ప్రవేశించే ముందు వారు వచ్చిన అన్ని చెక్ పాయింట్ల సీసీటీవీల ఫుటేజీలను సేకరించినట్లు వివరించారు.