కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విలయం సృష్టించిందో తెలిసిందే. ఎన్నో దేశాల ఆర్థిక స్థితిగతులను అతలాకుతలం చేసింది. లక్షల మంది ప్రాణాలను గాల్లో కలిపింది. ఇప్పటికీ చాలా వరకు దేశాలు కరోనా సంక్షోభం నుంచి తేలుకోలేదు. ఇక కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ వైరస్ పుట్టుకకు చైనాయే కారణమని ప్రపంచ దేశాలు ఇప్పటికే చైనా దేశంపై విమర్శలు గుప్పిస్తుంటే తాజాగా ఆ డ్రాగన్ దేశం మరో వైరస్‌కు జీవం పోస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
వుహాన్‌లో జరిపిన ఓ అధ్యయనంతో చైనా మరో వైరస్ను తయారు చేస్తుందన్న విషయం బయటపడినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఆ అధ్యయనం ప్రకారం సార్స్- కోవ్-2కు చెందిన జీఎక్స్-పీ2వీ అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నట్టు సమాచారం. ఇది 2017లో వెలుగుచూసిన జీఎక్స్ ఉత్పరివర్తనమని .. గతంలో ఈ వైరస్‌ను మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించినట్లు ఈ అధ్యయనం పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ వైరస్ మనుషులపై ఏ మేరకు ప్రభావం చూపనుందనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.