అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ట్రంప్.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. ఆయన తాజాగా ఓ కేసులో మరోసారి మియామిలోని ఫెడరల్ కోర్టుకు హాజరయ్యారు. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక పత్రాలను.. తన నివాసంలో దాచిపెట్టుకున్నారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా తనపై మోపిన అభియోగాలను ట్రంప్ తిరస్కరించారు. ఈ కేసులో ట్రంప్ అరెస్టుకు ఆదేశాలు వెలువడతాయనే ప్రచారం జరిగినా.. ఎలాంటి షరతులు లేకుండానే.. ఆయన కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు.
అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ .. రహస్య పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు అప్పగించకుండా.. తన వెంట తీసుకెళ్లారని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఎఫ్‌బీఐ ఫ్లోరిడాలోని ట్రంప్ మ్యాన్షన్‌లో సోదాలు చేపట్టింది. రహస్య పత్రాలను దాచిపెట్టినందుకు.. ట్రంప్‌పై మొత్తం 37 నేరారోపణలు నమోదయ్యాయి. అమెరికా చరిత్రలో అత్యంత విచారకరమైన రోజు ఇదేనని కోర్టుకు హాజరుకాక ముందు.. ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పేర్కొన్నారు.