నీ భర్త ఎక్కడంటూ ట్రంప్‌ పరిహాసం.. సైనిక కుటుంబాలను అవమానిస్తున్నారన్న నిక్కీ హేళీ

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య ఇటీవల మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా నిక్కీ హేలీపై ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. నిక్కీ నీ భర్త ఎక్కడంటూ పరిహాసమాడారు.

నిక్కీ భర్త మేజర్‌ మైఖేల్‌ హేలీ సైనిక విధుల్లో భాగంగా గత ఏడాది జూన్‌ నుంచి ‘హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా’ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తుండగా ఈ విషయం తెలియని ట్రంప్‌ శనివారం రోజున దక్షిణ కరోలినాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రస్తావన తెచ్చారు. ‘‘నిక్కీ భర్త ఎక్కడ? ఆయన దూరంగా ఉన్నారు. ఆమె భర్తకు ఏమైంది’’ అని ప్రశ్నిస్తూ.. గ్లోబలిస్టులు, యుద్ధోన్మాదుల అభ్యర్థి నిక్కీ అని ట్రంప్ ఆరోపించారు.

ట్రంప్‌ విమర్శలకు నిక్కీ ఘాటుగా బదులిస్తూ ‘‘డొనాల్డ్‌..! ఏదైనా చెప్పాలనుకుంటే.. నా వెనుక కాకుండా.. చర్చా వేదికలో నా ఎదుటే చెప్పండి. సైన్యంలో నా భర్త సేవలు నాకు గర్వకారణం.” అన్నారు. 75 ఏళ్లు పైబడ్డ రాజకీయ నేతలకు మానసిక సామర్థ్య పరీక్షలు అవసరమని తాను ఎప్పుడో చెప్పానని, వాటిలో ట్రంప్‌ పాస్‌ కావొచ్చు.. కాకపోవచ్చని ఎద్దేవా చేశారు. కానీ, ఒక సైనికుడి సేవలను గేలి చేస్తే అధ్యక్ష పదవి సంగతి అటుంచండి డ్రైవింగ్‌ లైసెన్సు పొందే నైతికహక్కు కూడా ఉండదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సైనిక కుటుంబాలను పదే పదే అవమానించే వారు దేశ సర్వసైన్యాధిపతి పదవిని చేపట్టడానికి అర్హులు కారని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news