అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరంతరం ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలిచే ఆయన తాజాగా ఎన్నికల ప్రచారంలో నోరు జారారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి విమర్శల పాలయ్యారు. ఇంతకీ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటంటే?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ప్రజలు తనను ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదని హెచ్చరించారు. అయితే ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా వెల్లడించలేదు. ఒహియోలోని డేటన్ సమీపంలో జరిగిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో మొబైల్ పరిశ్రమల గురించి ప్రస్తావిస్తూ తాను ఎన్నికైతే అమెరికాకు దిగుమతి చేసుకున్న కార్లను చైనా విక్రయించలేదని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం సైతం ఖరారైంది. జులైలో మిలావాకీలో జరగనున్న రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.