సీఏఏపై అమెరికా ఆందోళన.. మీ జోక్యం అవసరం లేదంటూ భారత్ కౌంటర్

-

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఇటీవల అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్‌ తప్పుబట్టింది. సీఏఏ పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని, ఈ వ్యవహరంలో జోక్యం చేసుకోవద్దని భారత విదేశాంగ శాఖ అమెరికాకు సూచించింది. మార్చి 11న వచ్చిన సీఏఏ నోటిఫికేషన్‌ ఆందోళనకు గురి చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ అన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌, ఇది పూర్తిగా దేశ అంతర్గత వ్యవహారమని జవాబిచ్చారు. ‘సీఏఏ వల్ల కొత్తగా పౌరసత్వం లభిస్తుందే తప్ప ఎవరి పౌరసత్వం పోదు’ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

తనకంటూ ఒక దేశం లేని వ్యక్తి సమస్యను సీఏఏ పరిష్కరిస్తుందని, మానవ హక్కులకు మద్దతు ఇస్తుందని, మర్యాదపూర్వకమైన జీవితాన్ని అందిస్తుందని రణధీర్ తెలిపారు. దీనిపై అమెరికా చేస్తున్న వ్యాఖ్యలు కల్పితం, అనవసరం అని వ్యాఖ్యానించారు. భారత్‌ బహుళ సంస్కృతులు, విభజన అనంతర చరిత్రపై పరిమిత జ్ఞానం ఉన్నవారు తమకు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, భారత్ శ్రేయాభిలాషులు, భాగస్వాములు సీఏఏ ఉద్దేశాన్ని స్వాగతించాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news