జపాన్లో న్యూ ఇయర్ తొలి రోజునే భూకంపం విలయం సృష్టించింది. ఒక్క రోజులోనే ాదాపు 155 ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప ధాటికి ఇప్పటివరకు 55 మంది మృతి చెందారు. మృతులంతా ఇషికవా రాష్ట్ర వాసులు కావడం గమనార్హం. భూకంపం అనంతరం కొనసాగే భూప్రకంపనలు ఇషికవా రాష్ట్రంలోని ఇషికవా నగరం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రంగా కొనసాగాయి. భూకంపం ధాటికి వేలాది భవనాలు, వాహనాలు, బోట్లు ధ్వంసమయ్యాయి.
భవనాలు కూలడం, అగ్నిప్రమాదాల కారణంగానే అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. నీగట, టొయామ, ఫుకూయ్, గిఫూ నగరాల్లో క్షతగాత్రులను గుర్తించారు. 45 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పర్యాటక ప్రదేశమైన వాజిమా నగరంలోని అసైచి వీధిలో భూకంపం కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. మంటల ధాటికి 200 భవనాలు కాలిపోయాయి. ఈ విషయాన్ని జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. కొన్ని భవనాలు ఇప్పటికీ మంటల్లోనే ఉన్నాయి. ఈ నగరంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ బీటలు వారి.. వాహనాలు కదలడం అసాధ్యంగా మారింది.