ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. తాజాగా ఆ సంస్థతో కోర్టు వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. తమ వేదికపై నకిలీ ఖాతాల వివరాలు ఇవ్వడంలో ట్విటర్ విఫలమవడంతోనే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన మస్క్.. తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వంపై ట్విటర్ వేసిన ‘ప్రమాదకర’ వ్యాజ్యాన్ని ఆ సంస్థ ఒప్పందంలో బయటపెట్టలేదని ఆరోపించారు. ఈ మేరకు తన కౌంటర్ దావాలో పేర్కొన్నారు.
కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల ఎలాన్ మస్క్‌పై ట్విటర్ డెలావర్ కోర్టులో దావా వేసింది. అయితే దీనిపై ఇటీవల మస్క్ కూడా కౌంటర్ దావా వేయగా.. ఆ పిటిషన్‌లోని వివరాలు తాజాగా బయటికొచ్చాయి. తనను మభ్యపెట్టి, మోసం చేసి ట్విట్టర్‌ను కొనుగోలు చేసేలా ఒప్పందంపై సంతకం పెట్టించారని మస్క్ ఆరోపించడం గమనార్హం. ఈ సందర్భంగా భారత ప్రభుత్వంతో ట్విట్టర్ ఎదుర్కొంటోన్న న్యాయపరమైన వివాదాన్ని కూడా మస్క్ తన కౌంటర్ దావాలో ప్రస్తావించారు.
“భారత ప్రభుత్వం విధించిన చట్టాలను పాటించకుండా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ కోర్టుకు వెళ్లింది. దీంతో తన మూడో అతిపెద్ద మార్కెట్‌ను ప్రమాదంలో పడేసింది. ఈ వ్యాజ్యం గురించి ట్విటర్ ఒప్పందంలో వెల్లడించలేదు.” అని మస్క్ దావాలో పేర్కొన్నారు. అయితే మస్క్ ఆరోపణలను ట్విటర్ తీవ్రంగా ఖండించింది. ఒప్పందం నుంచి తప్పించుకునేందుకు మస్క్ చెబుతున్న సాకులే ఇవన్నీ అని దుయ్యబట్టింది. ట్విటర్, మస్క్ పిటిషన్లపై డెలావర్ కోర్టు అక్టోబరు 17 నుంచి ఐదు రోజుల పాటు విచారణ జరపనుంది.
భారత్‌లో నూతన ఐటీ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ట్విటర్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నూతన చట్టాలు వ్యక్తుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని ట్విటర్ ఆరోపిస్తోంది. దీనిపై ఈ ఏడాది జులైలో మైక్రో బ్లాగింగ్ సైట్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టాల కారణంగా రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల పోస్టులు కూడా తొలగించాల్సి వస్తోందని, ఇలా అయితే భారత్‌లో తాము వ్యాపారం సాగించలేమని పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు.. దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది.