వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్(62) బుధవారం రోజున విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు రష్యా సివిల్ ఏవియేషన్ ఏజెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ విమాన ప్రయాణికులు జాబితాలో ప్రిగోజిన్ పేరు ఉందని అధికారులు తెలిపారు. రష్యాపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి వెనక్కి తగ్గిన రెండు నెలల వ్యవధిలోనే అతడు మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతడి మృతిపై ప్రపంచవ్యాప్తంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా వాగ్నర్ బాస్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు.
ఈ ఘటన వెనక వాస్తవాలు తనకు తెలియదని జో బైడెన్ అన్నారు. కానీ దీనిపై చానేమీ ఆశ్చర్యపోలేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటన వెనక పుతిన్ హస్తం ఉందనేలా నర్మగర్భంగా మాట్లాడారు. ఈ విమాన ప్రమాదంపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘నేను ఊహించినదానికంటే ఆలస్యమైంది. మానసిక యుద్ధ తంత్రం కూడా కావచ్చనిపిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.