గాజాలో తీవ్ర విషాదం.. ఇజ్రాయెల్ దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 76 మంది మృతి

-

ఇజ్రాయెల్ హమాస్ల మధ్య భీకర యుద్ధం ఇంకా కొనసాగుతోంది. హమాస్ మిలిటెంట్లను సమూలంగా అంతం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ సైన్యం గాజాపై తీవ్రంగా విరుచుకు పడుతోంది. ఓవైపు వైమానిక దాడులు మరోవైపు భూతల దాడులతో గాజాలో నరమేధం సృష్టిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 200 మంది మృతి చెందినట్లు ఆ ప్రాంత ఆరోగ్య శాఖ వెల్లడించింది.

శరణార్థి శిబిరం వద్ద జరిగిన మరో దాడిలో 14 మంది మరణించినట్లు పేర్కొంది. ఓ భవనంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 76 మంది మృతి చెందినట్లు తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతి తీవ్ర విషాదంగా ఐక్య రాజ్య సమితి పేర్కొంది.

గాజాపై దాడుల్లో సామాన్య పౌరులకు హాని కలగకుండా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. దక్షిణ గాజాలో పౌరులు ఎక్కువగా ఉన్న చోట అత్యంత శక్తిమంతమైన 2 వేల పౌండ్‌ల బాంబులను ఇజ్రాయెల్‌ జారవిడిచిందని న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. అందుకు సాక్ష్యంగా బాంబులు పడిన చోట ఏర్పడిన 208 గుంతలను కృత్రిమ మేధ సాయంతో గుర్తించినట్టు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news