హిరోషిమా వేదికగా ఇవాళ్టి నుంచి జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు ఆరంభం కాబోతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా దేశాల అధినేతలు పాల్గొంటారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా దూకుడు, మానవాళికి కృత్రిమ మేధ సవాళ్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కూడా ప్రస్తావనకు రావొచ్చు.
జపాన్ ప్రధాని కిషిద సొంతూరు హిరోషిమానే. ప్రస్తుత ఘర్షణాత్మక వాతావరణంలో అణ్వస్త్రాల విషయంలో అన్ని దేశాలూ స్వీయనియంత్రణతో, సంయమనంతో వ్యవహరించాలని ఆయన జీ-7 వేదికగా నొక్కిచెప్పబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇప్పటికే జపాన్ చేరుకున్నారు. జపాన్‌తో సునాక్ పలు వాణిజ్య ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేసియా, దక్షిణ కొరియా, వియత్నాంలాంటి మరికొన్ని దేశాల అధినేతలు జీ-7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారు. భారత్ తరఫున ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఇంధన సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థల నాయకులూ సదస్సులో పాల్గొంటారు.