పపువా న్యూగినియాలో దేశంలో నరమేధం జరిగింది. సాయుధ గ్యాంగ్‌లు ఉత్తర ప్రాంతంలో ఓ మారుమూల మూడు గ్రామాల్లో దాదాపు 26 మందిని హతమార్చారు. ఈ విషయాన్ని ఐరాస, ఆ దేశ పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. ఇది చాలా భయంకరమైన ఘటన అని.. మృతుల్లో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారని.. దాదాపు 30 మంది సాయుధులు వారిని హత్య చేశారని దేశంలోని ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్ పోలీస్ కమాండర్ జేమ్స్ బౌగెన్ తెలిపారు.
కొన్ని మృతదేహాలు గ్రామాల్లో కుళ్లిపోయే పరిస్థితికి రాగా.. మరికొన్నింటిని రాత్రి వేళల్లో మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లిపోయాయని చెప్పారు. చాలామందిని తలలు నరికి హత్య చేసినట్లు తెలిపారు. మృతుల్లో చాలామంది తల్లీ పిల్లలేనని పేర్కొన్నారు. 16 మంది చిన్నారులున్నారని పేర్కొన్నారు.
నరమేధం సృష్టించిన సాయుధ దళాలు ఆ గ్రామంల్లోని ఇళ్లను కూడా దుండగులు దహనం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో చాలామంది గ్రామస్థులు పోలీసుల రక్షణలో జీవిస్తున్నట్లు తెలిపారు. దాదాపు ఆరు నెలలుగా ఇక్కడ శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని వెల్లడించారు.