ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఓవైపు వైమానిక దాడులు.. మరోవైపు భూతల దాడులతో ఇజ్రాయెల్ గాజాపై విరుచుకు పడుతోంది. ఈ క్రమంలో గాజాలో పౌరుల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి. మరోవైపు తినడానికి తిండి లేక.. తాగడానికి మంచినీళ్లు లేక పౌరులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన గాజాకు తొలిసారిగా భారీ ఎత్తున సాయం అందింది.
ఈజిప్టు నుంచి 33 లారీల్లో ఆహారం, ఔషధాలు సహాయక శిబిరాలకు చేరుకున్నాయి. గాజాలోకి ఆదివారం రోజున 33 లారీల ఆహారం, నీరు, మందులను ఇజ్రాయెల్ అనుమతించగా.. ఈజిప్టు నుంచి రఫా సరిహద్దుద్వారా ఈ సాయం అందింది. గోదాముల్లోని సహాయక సామగ్రిని ప్రజలు లూటీ చేస్తుండటంతో ఈ సాయం ఏ మూలకూ సరిపోదని ఐరాస సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఓవైపు ఆకాశం నుంచి బాంబుల వర్షం.. మరోవైపు కాల్పుల మోతతో ఆ ప్రాంతమంతా మారణహోమంగా మారిపోయింది. దాదాపు 1,17,000 మంది గాజా వాసులు ఉత్తర గాజాలోని ఆసుపత్రులవద్ద తలదాచుకుంటున్నారు. మరోవైపు భవనాలు, సొరంగాల్లోంచి దాడులకు దిగిన డజన్ల మంది మిలిటెంట్లను సోమవారం అంతమొందించామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.