వలసదారుల సంఖ్యను పెంచేందుకు సిద్ధమైంది జర్మనీ. దేశ పౌరసత్వం, ద్వంద పౌరసత్వం విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలు, ఆంక్షల సడలింపు దిశగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు రూపొందించిన ప్రణాళిక చట్ట సభ్యులు ఆమోదించారు. ఓలాఫ్ షోల్జ్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లు పార్లమెంట్ 382-234 ఓట్ల తేడాతో నెగ్గింది. ఈ సంస్కరణలు వలసదారుల ఏకీకరణను ప్రోత్సహిస్తాయని.. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని ఆకర్షించడంలో సహాయ పడుతాయని ప్రభుత్వం పేర్కొంటుంది.
ప్రస్తుత చట్టం ప్రకారం.. జర్మీనలో ఎనిమిదేళ్లు నివసిస్తే పౌరసత్వం పొందేందుకు అర్హులు. అయితే ప్రత్యేక సందర్భాల్లో ఐదేళ్లకు అవకాశం కల్పిస్తారు. తాజాగా దీనిని ఐదేళ్లు, మూడేళ్లకు తగ్గించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. తల్లిదండ్రులు స్థానికంగా ఎనిమిదేళ్లుగా చట్టబద్ధంగా నివాసముంటే.. ఇక్కడ జన్మించే పిల్లలు పుట్టుకతో జర్మనీ పౌరులుగా మారుతారు. నూతన ప్రణాళికలో దీనిని ఐదేళ్లకు తగ్గించారు. ఈయూ దేశాలు, స్విట్జర్లాండ్ తప్ప మిగతా ఏ ఇతర దేశాల పౌరులు జర్మనీ పౌరసత్వం పొందినప్పుడు వారి మునుపటి జాతీయతను వదులుకోవాల్సి వచ్చేది. కొన్ని మినహాయింపులు ఉండేవి. అయితే ఇప్పుడు ఆ ఆంక్షలు తొలగిపోనున్నాయి. దీంతో జర్మనీకి వలసల సంఖ్య అధికమయ్యే అవకాశం కనిపిస్తోంది.