భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. స్నేహితులతో కలిసి రోడ్డు వద్ద నిలుచుకున్న అతడిపై గుర్తు తెలియని దండుగులు కాల్పులు జరపగా అందులో అతడు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ ఘటనపై అమెరికా పోలీసులు స్పందించారు. గోల్టీ బ్రార్ మరణించాడన్న ప్రచారాన్ని ఖండించారు. ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తర్వాత ఈ ప్రకటన చేశారు.
అమెరికాలోని హోల్ట్‌అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరపగా.. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అతడు కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌గా స్థానిక మీడియా పేర్కొంది. చివరికి ఫ్రెస్నో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా.. మృతుడు గోల్డీబ్రార్ కాదని లెఫ్టినెంట్ విలియం జే డూలే అని తేలినట్లు పోలీసులు ప్రకటన జారీ చేశారు. ‘‘మీరు ఆన్‌లైన్‌లో ప్రచారం నమ్మి మృతుడు గోల్డీబ్రార్ అనుకుంటే కచ్చితంగా తప్పే. అది పూర్తి అవాస్తవం. మా డిపార్ట్‌మెంట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. అసలు పుకార్లు ఎలా మొదలయ్యాయో తెలియదు. ఈ కాల్పుల ఘటన మరణించింది 37 ఏళ్ల జేవియర్ గాల్డ్నె’’ అని వెల్లడించారు.