ఎట్టకేలకు ఇజ్రాయెల్ – హమాస్ల మధ్య డీల్ కుదిరింది. రఫాపై దాడికి ఇజ్రాయెల్ సన్నద్ధమైన గంటల్లోనే హమాస్ బెట్టు సడలించి దిగొచ్చింది. ఇజ్రాయెల్ ప్రతిపాదనకు హమాస్ సిద్ధంగా లేనందున రఫాపై సైనిక చర్య కొనసాగుతుందని నెతన్యాహు ప్రకటించిన కొన్ని గంటలకే హమాస్ దిగొచ్చింది. ఈజిప్టు, ఖతార్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే హమాస్ ప్రతిపాదన తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని, రఫా ఆపరేషన్ కొనసాగుతుందని ఇజ్రాయెల్ ఉద్ఘాటించింది.
హమాస్‌పై సైనిక ఒత్తిడి పెంచడానికి, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడానికి, ఇతరత్రా యుద్ధ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సైనిక చర్య తప్పదని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ డిమాండ్లకు అనుగుణంగా ఒప్పందం ఖరారు కోసం తమ ప్రతినిధుల్ని చర్చలకు పంపుతామని ప్రధాని నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. అంతకుముందు రఫా నగరాన్ని వీడి వెళ్లాల్సిందిగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఏ క్షణమైనా రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతుందన్న సంకేతాలూ వెలువడ్డాయి. ఇక దాడే తరువాయి అన్న పరిస్థితుల్లో కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించిందన్న ప్రకటనతో గాజా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.