గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో హూతీ రెబల్స్ మళ్లీ విధ్వంసం సృష్టించారు. బుధవారం రోజున బార్బడోస్ జెండాతో వెళ్తున్న ఓ వాణిజ్య నౌకపై యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణితో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో నౌకలోని ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని అమెరికా ధ్రువీకరించింది. క్షిపణి దాడి జరగడం వల్ల ఓడలోని మిగతా సిబ్బంది వెంటనే అందులో నుంచి బయటకు వచ్చారని తెలిపింది.
ఈ ఘటన జరిగిన సమయంలో నౌకలో 20 మంది సిబ్బంది, ముగ్గురు సాయుధ గార్డులు ఉన్నారని నౌక యాజమాన్యం తెలిపింది. వారిలో భారత్‌కు చెందిన ఒకరు, వియత్నాంకు చెందిన నలుగురు, ఫిలిప్పీన్స్‌కు చెందిన 15 మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించింది. యెమెన్ నగరం ఎడెన్‌కు 90 కి.మీ దూరంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ దాడి చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఈ నౌక చైనా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తున్నట్లు ట్రాకింగ్ డేటా చెబుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ కొన్ని నెలలుగా ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా హూతీలు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.