మరో 30 ఏళ్లలో అంగారకుడి (మార్స్)పై నగరం ఏర్పడటమే గాక.. అక్కడ మనుషులు కూడా జీవిస్తారని స్పేస్‌ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేశారు. ‘మరికొన్ని సంవత్సరాల్లో మనం అంగారకుడిపై అడుగుపెడతాం’ అని ఓ ఎక్స్ యూజర్ చేసిన పోస్ట్‌కు మస్క్ స్పందించారు. ‘‘ఐదేళ్లలోపే ఆ గ్రహంపైకి మానవరహిత యాత్ర విజయవంతమవుతుంది. 10 ఏళ్లలోపే అక్కడికి మనుషులను కూడా పంపించగలుగుతాం. 20 ఏళ్లలో ఓ నగరాన్ని నిర్మిస్తాం. కచ్చితంగా వచ్చే 30 ఏళ్లకు అక్కడ సురక్షితంగా నాగరికత విరాజిల్లుతుంది’’ అని ఆయన పోస్టు పెట్టారు.
‘నేను అంగారక (మార్స్) గ్రహం మీద చనిపోవాలనుకుంటున్నాను..’ గతంలో ఓసారి చెప్పిన మాటలివి. మరో గ్రహంపై మానవాళి జీవనం సాగించాలని గత కొంతకాలంగా బలంగా మస్క్ వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ గ్రహంపై మస్క్ ఆసక్తి కనబర్చడం ఇదే తొలిసారి కాదు. మార్స్ పైకి 10 లక్షల మందిని తరలించేందుకు ఓ గేమ్ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.