హంగేరీ అధ్యక్షురాలు కేటలిన్ నోవక్ రాజీనామా చేశారు. పిల్లల లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తికి ఆమె క్షమాభిక్ష ప్రసాదించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో ఆమె పదవి నుంచి వైదొలిగారు. అయితే రాజీనామా చేసే ముందు.. తాను ఈ విషయంలో తప్పు చేశానని కేటలిన్ అంగీకరించారు. ఈ కేసులో ఆవేదనకు గురైన బాధితులకు క్షమాపణలు చెప్పారు. తానెప్పుడూ బాధితుల పక్షానే ఉంటానని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఓ చిల్డ్రన్ హోమ్ నిర్వహకులు పిల్లలపై పాల్పడుతున్న లైంగిక చర్యలను ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ కప్పిపుచ్చే ప్రయత్నం చేయగా ఈ కేసులో అతణ్ని కోర్టు దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది. గత ఏప్రిల్‌లో పోప్ ఫ్రాన్సిస్ దేశ పర్యటనకు వచ్చిన సమయంలో దోషికి కేటలిన్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ విషయం ఇటీవల ఓ వార్తాసంస్థ వెలుగులోకి తీసుకురావడంతో అప్పటి నుంచి ఆ దేశంలోని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. శుక్రవారం సాయంత్రం నుంచి అధ్యక్ష భవనం ముందు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఖతార్ పర్యటనకు వెళ్లిన నోవక్ శనివారం సాయంత్రం హుటాహుటిన బుడాపెస్ట్‌కు తిరిగొచ్చి వెంటనే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.