బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి రిషి సునాక్ తరచూ ఏదో వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయన ప్రధాని పదవి అర్హుడు కాదనే వాదనలూ వినిపించాయి. అయితే బ్రిటన్ ప్రధాన మంత్రిగా.. అత్యున్నత పదవిలో కొనసాగడానికి తాను సరైన వ్యక్తినే అని రిషి సునాక్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థిక సవాళ్లు, సాంకేతిక పరంగా వేగవంతమైన మార్పులు అవసరమైన సమయంలో తన నాయకత్వం ఎంతో కీలకమని ఉద్ఘాటించారు. కుటుంబంతో కాలిఫోర్నియాలో వ్యక్తిగత పర్యటన చేసి వచ్చిన సునాక్.. ది టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘సాంకేతికపరమైన మార్పులు ఎంతో ముఖ్యమైన సమయంలో తాను దేశాన్ని ముందుండి నడిపించడం ఎంతో అవసరమని రిషి అన్నారు. కంపెనీల్లో వృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన వంటి అంశాల్లో సాంకేతిక మార్పులు చేపట్టడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో వెళ్తోందని.. 7.9శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 6.8శాతానికి తగ్గిందని చెప్పుకొచ్చారు. తాను సరైన నేతగా నిరూపించుకునేందుకు ఇదే సరైన అవకాశం అని రిషి సునాక్ పేర్కొన్నారు.