పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉగ్రవాదం, హింస, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వేళ పాకిస్థాన్ పౌరులు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరుతున్నారు. ఉదయం 8 గంటలకు ఓటింగ్ మొదలవ్వగా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 12.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
దేశవ్యాప్తంగా 90వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఓటింగ్ పూర్తవ్వగానే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. పాక్ లో ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. అయితే, పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ మాత్రం దీన్ని తోసిపుచ్చింది. ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపింది. ఈ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంటర్నెట్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.