కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా తాగడంపై నిషేధం విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ప్రకటించారు. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హుక్కా తాగడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా హుక్కాను నిషేధిస్తున్నామని స్పష్టం చేశారు.
భవిష్యత్ తరాలకు మెరుగైన, సురక్షితమైన ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. యువత హుక్కాబార్లకు ఆకర్షితులవుతున్నారు. ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా నిండా పాతికేళ్లు రాకముందే చాలా మంది యువకులు ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. అని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు.
పొగాకు ఉత్పత్తులకు యువత బానిసలుగా మారుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతుండడంతో గతేడాది సెప్టెంబర్ నెలలో హుక్కా బార్లను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. పొగాకు ఉత్పత్తుల కొనుగోలు వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపింది.