నేటితో ముగియనున్న ఇజ్రాయెల్‌-హమాస్ ఒప్పందం- పొడిగించే అవకాశం ఉందా..?

-

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఇవాళ్టితో ముగియనుంది. ఒప్పందం ప్రకారం ఇరువురు బందీలను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు హమాస్ 58 మందిని.. ఇజ్రాయెల్ 114 మంది బందీలను విడుదల చేసింది. అయితే ఇవాళ్టితో ఒప్పందం ముగియనుండగా.. ఈ ఒప్పందం పొడిగిస్తారా లేదా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. పొడిగింపుపై ఇప్పటివరకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా ఊపిరి బిగపట్టుకుని చూస్తోంది.

మరోవైపు గాజా పట్టీలో పర్యటిస్తున్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ప్రతి బందీని విడిపిస్తామని అన్నారు. హమాస్‌ అంతం, బందీల విడుదల, భవిష్యత్‌ ముప్పులు నివారించడమే ప్రస్తుతం తమ ముందు ఉన్న మూడు ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన శక్తియుక్తులన్నీ తమకు ఉన్నాయని చెప్పారు.

అయితే బందీల విడుదలపై ఇటీవల స్పందించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు జరుగుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు శాంతియుతంగా జీవించాలంటే ‘ద్విదేశ పరిష్కారం’ ఒక్కటే మార్గమని ఆయన పునరుద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news