తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వస్తాయని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి ప్రకాశ్ జావ్డేకర్ అన్నారు. ఈ ఫలితాలను రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించలేరని తెలిపారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలలో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అధికారాన్ని మార్చాలని డిసైడ్ అయ్యారని జావడేకర్ చెప్పారు. అయితే దీనికి చాలా కారణాలున్నాయని వివరించారు.
తమకు ఏదో చేస్తానని కేసీఆర్కు పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు దారుణంగా దగా పడ్డారని జావడేకర్ అన్నారు. అందుకే ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ హామీనీ బీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదని వెల్లడించారు. మూడు, నాలుగు శాతం మందికి కూడా దళితబంధు అందలేదని, బీసీ బంధు రెండు శాతం మందికి కూడా చేరలేదని, మైనార్టీ బంధుదీ అదే పరిస్థితి అని విమర్శించారు. తొలి ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపిందని, మలిదశ ఉద్యమంలో 1200 మంది చనిపోయారన్న జావడేకర్.. ఈ రెండింటికీ కారణమైన కాంగ్రెస్ను ప్రజలు నమ్మరని చెప్పారు.