హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరు దేశాల మధ్య ఘర్షణ వల్ల పశ్చిమాసియాలో ముప్పేట దాడి ముప్పు ముంచుకొస్తోంది. ఓవైపు గాజా నుంచి హమాస్ రాకెట్లను ప్రయోగిస్తోంటే.. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడులను చేస్తూ.. గాజా సరిహద్దుల్లో బలగాలను మోహరించి యుద్ధానికి సిద్ధంగా ఉంది. లెబనాన్‌వైపూ పరిస్థితి ఉద్రిక్తంగా ఉండగా.. ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను హెజ్‌బొల్లా ధ్వంసం చేస్తోంది. ఇంకోవైపు.. గాజాలో భూతల దాడులకు దిగితే తామూ యుద్ధంలోకి వస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇలా పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు ఆవరిస్తున్నాయి.
గాజా సరిహద్దులో మోహరించిన 3,60,000 మంది ఇజ్రాయెల్ రిజర్విస్టులు లోపలికి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా ఇళ్లు ఖాళీ చేసి దక్షిణ గాజావైపు వెళ్లడంతోపాటు ఆసుపత్రులు, ఐక్యరాజ్య సమితి శరణార్థ శిబిరాల వద్దకు చేరుతున్నారు. వైమానిక దాడులతో డజన్లకొద్దీ హమాస్ స్థావరాలను ధ్వంసం చేశామని, కమాండ్ సెంటర్లను, రాకెట్ దాడులను నిరోధించామని, మిలిటెంట్ కమాండర్లను హతమార్చామని ఇజ్రాయెల్ వెల్లడించింది.
మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఆపితే బందీలను విడుదల చేయడానికి హమాస్ సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ భూతల దాడులకు దిగితే యుద్ధంలోకి తామూ ప్రవేశిస్తామని హెచ్చరించింది. ఉత్తర ప్రాంతంలో తమను పరీక్షించొద్దని హెజ్‌బొల్లా, ఇరాన్‌లకు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది.