అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం చోటుచేసుకోగా.. తాజాగా ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
అయితే డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావాల్సిన మద్దతు తనకు ఉందని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. పార్టీ ప్రతినిధుల్లో సగానికి పైగా తనవైపు ఉన్నారని ఆమె చెప్పారు. బైడెన్ పోటీ నుంచి వైదొలగిన తర్వాత తొలిసారి ఆమె విల్మింగ్టన్‌లో బైడెన్ ప్రచారం బృందంతో సమావేశమయ్యారు. తనకు మద్దతుగా నిలవాలని కోరారు. అభ్యర్థి మాత్రమే మారుతున్నారని.. తమ లక్ష్యం మాత్రం ఒకటేనని వారితో చెప్పారు. పార్టీతో పాటు దేశం మొత్తాన్ని ఏకం చేసి ఈ ఎన్నికల్లో గెలుద్దామని పిలుపునిచ్చారు. మరోవైపు ఇప్పటికే బైడెన్ కమలా హ్యారిస్కు తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.