అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తిగత విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన శనివారం పెన్సిల్వేనియా సభలో మాట్లాడుతూ.. హారిస్ భయంకరంగా నవ్వుతారని, ఆమె నవ్వుపై నిషేధం ఉందని, అందుకే ఆమె నోరు మూసుకుని తిరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
మరోవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహరిస్ స్పందించారు. తన రన్నింగ్ మేట్ టిమ్ వాజ్‌తో కలిసి పెన్సిల్వేనియా ర్యాలీలో కమలా హారిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో వక్రబుద్ధి కన్పిస్తోందని అన్నారు. ఎదుటివారిని దెబ్బ కొట్టడం అనేది ఒక నాయకుడి చతురత మీద ఆధారపడి ఉంటుందని.. ఇతరులను తక్కువ చేసి చేసి మాట్లాడే వారంతా పిరికివాళ్లేనని కమలా హారిస్ వ్యాఖ్యానించారు.