కెన్యాలోని నైరూబీలో రెండేళ్ల నుంచి మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసి చెత్తకుప్పలో పారేసిన కేసులో నిందితుడు దొరికాడు. ఈ కేసులో 33 ఏళ్ల కొల్లిన్స్ జమైసీ కాలుషాను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో తాను 42 మందిని హత్య చేసినట్లు అతడు అంగీకరించాడని.. అతడికి మనిషి ప్రాణం అంటే ఏమాత్రం విలువ లేదని అధికారులు తెలిపారు.
ఇటీవల తొమ్మిది మంది మహిళల మృతదేహాలను నైరూబీలోని ముకురూ మురికివాడ చెత్తకుప్పలో గుర్తించారు. ఈ ప్రదేశానికి 100 మీటర్ల దూరంలోనే శిథిలమైన గదిలో నిందితుడు కాలుషా అద్దెకు ఉండే ఇంటిని తనిఖీ చేయగా.. భారీ ఎత్తున టేపు, నైలాన్ సంచులు, పరిశ్రమల్లో వాడే రబ్బర్ గ్లౌజులు కనిపించాయి. మృతదేహాలను పారేసే క్రమంలో వీటిని వినియోగించినట్లు గుర్తించారు.
2022 నుంచి 11 జులై 2024లోపు అతడు 42 మంది మహిళలను వలవేసి లొంగదీసుకొని.. ఆపై హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను ఛిద్రం చేసి సమీపంలో భారీ డంపింగ్ యార్డ్‌లో పడేసేవాడని తెలిపారు. తాను చంపిన వారిలో తన భార్య కూడా ఉందని అతడు అంగీకరించినట్లు చెప్పారు.