రష్యాలో అడుగుపెట్టిన కిమ్‌.. నేడు పుతిన్​తో భేటీ.. అప్రమత్తమైన అమెరికా, జపాన్‌

-

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఎట్టకేలకు రష్యా చేరుకున్నారు. మంగళవారం ప్రత్యేక రైళ్లో రష్యా చేరుకున్న ఆయన ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్​తో భేటీ కానున్నారు. పాశ్చాత్య దేశాలతో ఘర్షణ పడుతున్న ఈ రెండు దేశాల అధినేతలు పరస్పరం భేటీ కానుండడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకుంటోంది. రెండు దేశాలపై అమెరికా, ఐరాస విధించిన ఆంక్షలే వీరిద్దరినీ చేరువ చేసినట్లయింది.

ఈ భేటీలో పుతిన్‌తో కిమ్‌ భేటీఅయి ఆయుధాల విక్రయంపై చర్చించనున్న విషయం తెలిసిందే. వీటిని అమ్మడం ఉత్తర కొరియాకు, కొనడం రష్యాకు అనివార్యంగా మారింది. నెలల తరబడి ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధం కారణంగా తరిగిపోతున్న కొన్నిరకాల ఆయుధాల నిల్వల కోసం రష్యా ఎదురుచూస్తోంది.

మరోవైపు ఇరువురు నేతల భేటీపై అమెరికా, జపాన్‌ వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. రష్యాకు ఆయుధాలు విక్రయించకూడదనే మాటకు ఉత్తర కొరియా కట్టుబడి ఉండాలని శ్వేతసౌధం జాతీయ భద్రత మండలి ప్రతినిధి కోరారు. భేటీని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆయుధాల విక్రయం జరిగితే మరిన్ని ఆంక్షలకు వెనుకాడేది లేదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news