యుద్ధానికి సిద్ధం కండి.. సైన్యానికి కిమ్ జోంగ్ ఉన్ కీలక ఆదేశాలు

-

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా, దక్షిణ కొరియాలు ఉమ్మడి యుద్ధ అభ్యాసాలకు సిద్ధమవుతున్నందున కిమ్‌.. తమ దేశ సైన్యాన్ని అప్రమత్తం చేశారు. సైనికులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీటైన సమర ప్రణాళికలతో సిద్ధం కావాలని, సరిహద్దుల్లో మోహరించిన దళాలు తమ పోరాట పటిమకు పదును పెట్టుకోవాలని స్పష్టం చేశారు.

అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియాలో తయారైన కొత్త అస్త్రాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని సైన్యాన్ని కిమ్ ఆదేశించారు. ఆయుధ ఉత్పత్తినీ పెంచాలని సూచించారు. ప్రస్తుతం సైనిక జనరల్‌గా ఉన్న పాక్‌-సు-ఇల్‌ స్థానంలో కొత్త జనరల్‌గా రి యాంగ్‌ గిల్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ఉత్తర కొరియా పాలక వర్కర్స్‌ పార్టీ గురువారం నిర్వహించిన సమావేశంలో కిమ్‌ పెద్ద మ్యాపు మీద దక్షిణ కొరియా రాజధాని సియోల్‌తోపాటు ఆ దేశపు మధ్య భాగంలో ఉన్న డేజియోన్‌ నగరం చుట్టుపక్కల ప్రాంతాలను చూపుతున్నట్లు ఫొటోలు వచ్చాయి. అమెరికా, దక్షిణ కొరియాలపై అణ్వస్త్రాలను ప్రయోగించే సత్తా తనకుందని కిమ్‌ పదేపదే చాటుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news