2050 నాటికి ప్రపంచంలో 100 కోట్ల మందికి కీళ్లవ్యాధి.. లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడి

-

2050 నాటికి దాదాపు వంద కోట్ల మంది ప్రజలు కీళ్లవ్యాధితో బాధపడుతారని ‘లాన్సెట్‌ రుమటాలజీ జర్నల్‌’లో ప్రచురితమైన పరిశోధన పత్రం చెబుతోంది. 30 ఏళ్లు, అంతకుమించిన వయసువారిలో ప్రపంచంలో 15% మంది ప్రస్తుతం ఆ సమస్యతో సతమతం అవుతున్నారని తెలిపింది. ప్రధానంగా- వయోభారం, జనాభా పెరుగుదల, స్థూలకాయం అనే మూడు కారణాల వల్ల కీళ్ల సమస్యలు వేగంగా పెరిగిపోతున్నాయని అధ్యయనకర్తలు తేల్చారు. స్థూలకాయాన్ని నియంత్రించగలిగితే ఈ సమస్యను 20% మేర తగ్గించవచ్చని వారు పేర్కొన్నారు.

శారీరక శ్రమ చేస్తున్నకొద్దీ జీవితంలో త్వరగా గాయాలపాలయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవడంతోపాటు కీళ్ల సమస్యల నుంచీ బయటపడవచ్చని ఐహెచ్‌ఎంఈ శాస్త్రవేత్త లియానే ఆంగ్‌ తెలిపారు. మోకాలు, తుంటిఎముకలో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం పురుషుల (39%) కంటే మహిళల్లోనే ఎక్కువ (61%) అని అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతానికి ఆస్టియో ఆర్థరైటిస్‌ నిర్మూలనకు సమర్థమైన చికిత్స అందుబాటులో లేనందున.. అది రాకుండా చూసుకోవడమే మేలని సూచించింది. కీళ్ల మార్పిడి చికిత్సలను తక్కువ ఆదాయం ఉన్న దేశాలకూ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news