రాష్ట్ర మంత్రిగా రేపు పట్నం మహేందర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

-

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పనిలో పనిగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఇవ్వనున్నారట. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో.. ఒక ఖాళీ ఉంది. కేబినెట్ నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆ ఖాళీ కొనసాగుతోంది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో రాజకీయ అంశాలు దృష్టిలో పెట్టుకొని.. ఆ ఖాళీని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తాండూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ప్రకటించినందున గతంలో అక్కడి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మహేందర్ రెడ్డికి.. మంత్రి పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. రేపు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కి సమాచారం వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో రాష్ట్రమంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గురువారం రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news