దూసుకెళ్తున్న చింగారి యాప్‌.. 30మిలియ‌న్ల డౌన్లోడ్స్‌

భార‌త్‌లో చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడం చింగారికి బాగా క‌లిసి వ‌చ్చింది. అదేనండీ.. మేడ్ఇన్ఇండియా షార్ట్-వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ చింగారి యాప్ ఏకంగా 30 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్‌ను దాటింది. కేవ‌లం మూడు నెలల వ్యవధిలో ఈ ఘనతను సాధించిందని చింగారి క్రియేట‌ర్లు చెబుతున్నారు. ఈ యాప్‌లో మ‌రిన్ని ఫీచ‌ర్ల‌ను యాడ్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అధునాతన ఫ్రంట్, రియర్ కెమెరా సాధనాలను అందించడానికి దాని ప్లాట్‌ఫారమ్‌లో ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌లను కూడా జోడించినట్లు చెప్పారు. అయితే.. చింగారి యాప్‌ను వినియోగిస్తున్న వారిలో అత్యధిక శాతం 18-35 వ‌య‌స్సు వారే ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇంగ్లీష్, స్పానిష్ భాషలతో పాటు, హిందీ, బంగ్లా, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం, ఒడియా, మరియు తెలుగు భాషలలో చింగారి కంటెంట్ అందుబాటులో ఉందని చింగారి ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. చింగారి యాప్‌కు భార‌త్‌లోనేగాకుండా.. యూఏఈ, అమెరికా, కువైట్, సింగపూర్, సౌదీ అరేబియా, వియత్నాంలలో కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ దేశాల్లో వినియోగిస్తున్న‌వారి సంఖ్య రానున్నరోజుల్లో మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. స‌రిహ‌ద్దుల్లో క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న చైనాకు త‌గిన బుద్ధి చెప్పే చ‌ర్య‌ల్లో భాగంగా.. కేంద్ర ప్ర‌భుత్వం ఆ దేశానికి చెందినే అనేక యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం తెలిసిందే.