భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌లో చేసిన పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ తాజాగా మనదేశానికి వచ్చారు. ఈ వివాదంపై ఆయన మరోసారి స్పందించారు.
తమ మంత్రులు చేసిన వ్యాఖ్యలు తమ ప్రభుత్వ అభిప్రాయం కాదని స్పష్టం చేశారు జమీర్. అలా జరిగి ఉండాల్సింది కాదన్న ఆయన అలాంటి వైఖరి పునరావృతం కాకుండా తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయంలో అపార్థాలు చోటుచేసుకున్నాయని, ఇప్పుడు ఆ దశను దాటేశామని చెప్పుకొచ్చారు. భారత్-మాల్దీవుల ప్రభుత్వాలు జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాయని జమీర్ వెల్లడించారు.
ఈ ఏడాది జనవరిలో మోదీ లక్షద్వీప్‌లో పర్యటించి కొంతసేపు సముద్రం ఒడ్డున సేద తీరి సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునే వారు.. తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని కోరుతూ.. అక్కడి ఫొటోలను షేర్ చేశారు. దీనిపై మాల్దీవులు మంత్రులు అక్కసు వెళ్లగక్కడంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది.