అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోరు జోరుగా సాగుతోంది. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు ఓవైపు డెమోక్రటిక్, మరోవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఈ రెండు పార్టీల నుంచి ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. పోటీ దాదాపు వీరి మధ్యే ఉంటుందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ తరుణంలో ఓ సర్వే ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్షుడు బైడెన్ బదులుగా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా వైపే అమెరికన్లు మొగ్గు చూపుతున్నట్లు రాస్ముసేన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది. బైడెన్ మళ్లీ ఎన్నికల్లో నిలబడేందుకు అమెరికన్లు ఇష్టపడటం లేదని, 48 శాతం మంది ఆయణ్ను వ్యతిరేకిస్తున్నారని ఈ సంస్థ తెలిపింది. కమలా హ్యారిస్, హిల్లరీ క్లింటన్, గావిన్ న్యూసమ్ కంటే మిషెల్లీ ఒబాబాకే ఎక్కువ సంఖ్యలో అమెరికన్లు మద్దతు పలికారని తెలిపింది. అత్యధికంగా 20 శాతం మంది మిషెల్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారు. 15 శాతం కమలా హారిస్, 12 శాతం హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా నిలిచారు.